Sunday, January 15, 2012

మయ సభ - మహాభారత ఘట్టం (దానవీర శూర కర్ణ చలనచిత్రం లోని నందమూరితారక రామారావుగారి స్వర విన్యాసం పదాలలో...)


మయ సభ - మహాభారత ఘట్టం
(దానవీర శూర కర్ణ చలనచిత్రం లోని నందమూరితారక రామారావుగారి స్వర విన్యాసం పదాలలో...)
(సుయోధనుడు మయ సభాప్రవేశం కాగానే ఒక పుష్పమాలిక గాలిలో తేలుతూ వచ్చి కురురాజు మెడలో వాలుతుంది)
అహో......! అమ్లానభావ సంభావితమైనె ఈ దివ్య ప్రసూనమాలికారాజమును, కురుసింహుని గళసీమను అలంకరించినవారెవ్వరు?
ఊఁ... (నవ్వుతూ) అనిమిషయామినీ అతిథి సత్కార దివ్య సేవా ప్రభావమౌనా....ఔ...ఔ....(ఇంతలోనే పుష్పమాల అదృశ్యమౌ తుంది ఇట్టి మాయను చూసి ధుర్యోధనుడు నవ్వుకుంటూ ముందుకువెళతాడు. ఇంతలో ఎవరో పిలచినట్టుగా అనిపిస్తుంది). ఏమా సుస్వరము? కాకనీకల కంఠకంఠ కుహుకుహూకార సుతిహిత దివ్యసురకామినీయక సుస్వాగతమౌనా? (యెవరూ లేకుండానే పుష్పవర్షం కురుస్తుంది. కురురాజు సంతోషిస్తూ)సొబగు.....సొబగు....సొబగు.....సొబగు.... (ఆని ముందుకు అడుగులువేస్తాడు. అక్కడ యే ఆధారమూ లేకుండగానే గాలిలో వ్రేళ్ళాడుతున్న ఒక రాయిని చూచి పరీక్షించి)ఔరా..... ఇది శాస్త్ర విజ్ఞానప్రభావమౌనా..... ఔ....ఔ....(అంటూ అచటి నుండి నిష్క్రమిస్తాడు. అక్కడ నర్తకీ మణులు తనతో నాట్యం చేస్తున్నట్టుగా అనిపించి తానూ నాట్యం చేస్తాడు. కాని తాను ఒక్కడే నాట్యం చేస్తున్నడని గ్రహించి).
అయ్యారే...భ్రమ...కించిత్ మధుపానాశక్తమైయున్న మా చిత్తభ్రమ........భళా.... సముచితసత్కారస్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణా భూషణములచే... ఈ సభాభవనము ధన్యము.... ధన్యము.... అకుంఠిత నిర్మాణ చాతురీ ధురీణుడవగు ఓ మయబ్రహ్మ... నీ శిల్ప చాతురీ మధురిమ ఆబ్రహ్మకుగానీ....విశ్వబ్రహ్మకుగాని లేదు....లేదు....లేదు.... (ఇంతలో తాను పాండవుల నిర్మాణ కర్తను ప్రసంసిస్తున్నానని గుర్తొచ్చి)
ఊఁ......లేవచ్చును...లేకపోవచ్చును. కానీ పాండవ హతకులకిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమైన మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరావినిత శాశ్వత మహైశ్వర్యమహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనదవారిదరగరభూర్గుత అనర్ఘముక్తామణీ విలాసంబులు మాకుండినవుండవచ్చును. సాగరమేఖలాసద్దీ కరగ్రహణమొనర్చి సార్వభౌమత్వపదమ్మందిన అందవచ్చు కానీ.....ఇట్టి సభాభవనం మాకులేకపోవుటమోపలేని లొపం. శతృ కృతాపచారములకంటే, శతృ వైభవము శక్తిమంతుల హృదయములకు దావానల సదృశము. ఊఁ.... ఇక నేనిందుండరాదు.(అనుకుని యెదురుగాకనిపించిన ద్వారం వైపునడుస్తాడు. కాని అది ద్వారం కాదు గోడ. గోడని గుద్దుకొని ఉక్రోషంతో...).
ఎమీ ...... నిరాఘాట పథుడనగు నాకీ కవాట ఘట్టనమా? (అది ద్వారం కాదు గోడ మీద చిత్రం అని గ్రహించి, తన భ్రమకు సిగ్గుపడి...యెవరైనా పరికించారేమో అని చుట్టూ పరికించి,) పరులెవ్వరూ లేరుకద?... మా భంగపాటును పరికించలేదుకద...నిస్సీ..... ఈ మయసభ మాకు విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మవమానించుటకే... ఊఁ (వేరొక ద్వారం వైపు వెళుతూ సభా మద్యన ఉన్న జలాశయమును చూచి) ఏమీ.... సభాభవన గర్భమున సుందర జలచర సంచితయై జలాసయమా?(అని కాలు నీటిలో పెడతాడు. అది నీరుకాదని గ్రహించి, )
ఊఁ...... అంతయు మాయామోహితముగానున్నదే ...(అనుకొని ఆ నిర్మిత జలాశయం మీదనుండి నడుచుకుని వెళ్ళి, అక్కడ మరొక జలాశయం ఉండటం చూచి, ..) ఇదియునూ అట్టిదియే .. (అంటూ దాని మీదుగా నడువ యత్నించి, అది నిజమైన జలాశయం అవటంతో కాలు తడబడి, చతికిల పడతాడు. ఆ దృశ్యాలు చూచిన పరిచారికా పరివృతయైన ద్రౌపది మరియు ఆమె పరిచారికలు నవ్వుఆపుకోలేక పగులబడి నవ్వుతారు. అది విని ధుర్యోధనుడు అవమానభారంతో, తొట్రుపాటుతో ఎవ్వరని చూస్తాడు. అక్కడ ద్రౌపది కనిపిస్తుంది. ) పాంచాలీ.... పంచ భర్తృక (అని అవమాన భారంతో అంటాడు. ఇంతలో భీమసేనుడు పొడివస్త్రములు తీసుకుని వస్తాడు.).


No comments:

Post a Comment